హైదరాబాద్‌లో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన పరిశుభ్రత లోపాలు గుర్తించడంతో ఎనిమిది సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు.
నవంబర్ 10న నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో 24 బృందాలు 23 ఆహార సంస్థలను పరిశీలించాయి. బొద్దింకలు, ఎలుకల సంచారం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్రమైన వంటశాలలు వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. దాదాపు 700 కిలోల కలుషిత, పాడైన ఆహార పదార్థాలను తొలగించడంతో పాటు అనుమానాస్పద కల్తీపై 25 ఆహార నమూనాలను సేకరించారు.
మరోవైపు మాదాపూర్‌లోని ఓ క్లౌడ్ కిచెన్ తనిఖీల్లో గడువు ముగిసిన 60 కిలోల కేక్ బేస్‌లను అధికారులు ధ్వంసం చేశారు. నవంబర్ 10తో గడువు ముగిసిన కేక్ బేస్‌లతో నవంబర్ 12 వరకు గడువు ఉన్నట్లు పేర్కొంటూ కేకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment