తమిళనాడు ప్రభుత్వం సినీ ప్రేక్షకులకు, సినిమా నిర్మాతలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ వెసులుబాటు సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు వర్తించనుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2:30 గంటల వరకు షోలు నిర్వహించుకోవచ్చు. వారాంతాలు, ప్రభుత్వ సెలవులు, స్థానిక పండుగ రోజుల్లోనూ ఆరు షోలకు అనుమతి ఉంటుంది. గతంలో కొత్త సినిమాలకు రోజుకు ఐదు షోలకే అనుమతి ఉండేది. తాజాగా ఆ సంఖ్యను ఆరుకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తమిళ సినీ నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, థియేటర్ యజమానుల సంఘాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా విడుదలయ్యే కొత్త సినిమాలకు ఈ నిర్ణయం ప్రయోజనం కలిగించనుంది. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలకు అదనపు షోలతో ప్రేక్షకులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.