తెలంగాణలో మొబైల్ టవర్ల నుంచి విలువైన పరికరాలను చోరీ చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. మొబైల్ టవర్లలో ఉండే Radio Remote Units (RRUs)ను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరికరాల విలువ సుమారు రూ.1.62 కోట్లు ఉంటుందని తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 38 చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. వీరిలో ముగ్గురు ఇంజినీర్లు, నలుగురు టెక్నీషియన్లు లేదా రిగ్గర్లు, ఒక డ్రైవర్, ఒక మాజీ ఉద్యోగి ఉన్నారు. తమకు ఉన్న Technical Knowledge, మొబైల్ టవర్లపై అవగాహనను ఉపయోగించుకుని రాత్రి వేళల్లో పరికరాలను చోరీ చేసేవారని పోలీసులు తెలిపారు. అనంతరం చోరీ చేసిన పరికరాలను హైదరాబాద్‌లో విక్రయించినట్లు వెల్లడించారు.


చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో నిందితులు Luxury Cars, Bikes కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి మూడు కార్లు, రెండు బైకులు, రూ.15 లక్షల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నల్లగొండలో 9, మిర్యాలగూడలో 16, దేవరకొండలో 2, సూర్యాపేటలో 8, ఇతర ప్రాంతాల్లో 3 చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి.