బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం ఉండటంతో తెలంగాణలో వాతావరణం మారనుంది. Cyclone Akvan ప్రభావంతో నవంబర్ 20 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department – IMD) తాజా Forecastలో వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ నవంబర్ 16, 17 తేదీల్లో Cyclonic Stormగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో నవంబర్ 20, 21 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు కూడా వీచే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నవంబర్ 21, 22 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.

మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు పూర్తయిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అయితే తుఫాన్ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలు తాజా Weather Updates, IMD Advisoriesను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు