సంగారెడ్డి : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద ఘటనపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె పీఏ ఆకాశ్(24) ఉన్నాడు. సదాశివపేటలోని దర్గాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత తన ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరారు. తెల్లవారుజామున 4:58 గంటల సమయంలో శామీర్‌పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించారు. సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత బతికే ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పీఏ ఆకాశ్ ఎడమకాలు విరిగిపోయింది. అతను శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదమే అని పోలీసులు తేల్చారు.