ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శనివారం 70వ ఏట అడుగిడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంబురాలు అంబారన్నంటనున్నాయి. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను ప్రపంచమంతా ఎన్నారైలు ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేస్తామని చెప్పారు. ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాల్లో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో వేడుకలు నిర్వహించగా, వినయ్‌గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టారు. బ్రిస్బేన్‌లో విన్నీ తూముకుంట, సిడ్నీలో రవిశంకర్ దుపాటి, అడిలైడ్‌లో రవియాదవ్, కాన్‌బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉదయ్‌రెడ్డి, విశ్వామిత్ర మంత్రి పడగ, సునీల్‌రెడ్డి, శివ బిళ్ల, సుకుమార్ ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా, శనివారం కేక్ కటింగ్, పండ్ల పంపిణీ చేపట్టాలని బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు.