ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా విధించింది. అలాగే కోర్టు ఖర్చులు కూడా అతనే భరించాలని ఆదేశించింది. ఒంగోలు సమీపంలోని మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య దగ్గర బండ్ల గణేశ్ 2019లో రూ.95 లక్షల అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత జానకీరామయ్య మరణించడంతో అతని తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు, బండ్ల గణేశ్‌కు మధ్య ఆర్థిక వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జానకీరామయ్య తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్కు అందించారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరగ్గా.. తాజాగా ఏడాది జైలు శిక్ష విధిస్తూ మున్సిఫ్ మెజిస్ట్రేట్ పి.భానుసాయి మంగళవారం తీర్పు వెల్లడించారు. దీంతో పాటు 30 రోజుల్లో 95 లక్షల రూపాయాలను చెల్లించాలని ఆదేశించారు. అలాగే కోర్టు ఖర్చులకు గానూ అదనంగా రూ.10 వేలు కూడా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.