తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న ఎల్‌బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో 15,750 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లుచేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు గతేడాది అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది. తెలంగాణలో పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల కోసం 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడంతో 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించారు. పోలీసు రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు. అయితే ఆ అడ్డంకులు తొలిగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది.