తెలంగాణ కుంభమేళా, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర మేడారం జాతర. మేడారం మహా జాతరలో నేడు మరో మహా క్రతువు జరగనుంది. దీంతో మేడారం జాతరకు సంబంధించి మరో ప్రధాన ఘట్టానికి నేడు అంకురార్పణ జరుగుతుంది. గతవారం గుడి మెలిగే పండుగను నిర్వహించగా, నేడు ఉదయం మండ మెలిగే పండుగను నిర్వహించనున్నారు. దీంతో మేడారం మహా జాతరకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. మండ మెలిగే పండుగ నుండి సరిగ్గా వారం రోజులకు పౌర్ణమి నాడు మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జాతరను ఈసారి ఘనంగా నిర్వహించడానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తుంది. ఈరోజు మండ మెలిగే పండుగ సందర్భంగా సమ్మక్క సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, పూనుగొండ్ల లో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజుల ఆలయాలలో ఆదివాసీలు ఈరోజు పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాల వద్ద పుట్ట మట్టితో అలికి ముగ్గులు వేస్తారు. అంతేకాదు సమ్మక్క, సారలమ్మలు ఉపయోగించిన ఆయుధాలను, గజ్జెలను , కత్తులు కుంకుమ భరిణలు, ఇతర పూజ సామాగ్రిని శుద్ధి చేస్తారు. ఆపై డప్పుచప్పుళ్ళ మధ్య పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, అక్కడి నుండి సమ్మక్క గుడికి వెళ్ళిన గిరిజన ఆడపడుచులు పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు గ్రామ బొడ్రాయికి శుద్ధిజలంతో అభిషేకాలు నిర్వహిస్తారు .మండమెలిగే పండుగలో భాగంగా మేడారం చుట్టూ దిష్టి తోరణాలు కట్టి, గ్రామం చుట్టూ చలిగంజి, అంబలితో కట్టు పోసి, ఆపై సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన పూజా సామాగ్రిని మేడారం గద్దెలపై తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పసుపు కుంకుమలతో పూజలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరిస్తారు. అనంతరం పూజారులు అక్కడే చలమయ్య మొక్కలు కూడా సమర్పిస్తారు. ఇక అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి, పూజాదికాలు పూర్తయిన తర్వాత జాగరణ చేపడతారు . ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు అమ్మవారి గద్దెల వద్దకు భక్తులు ఎవరు వెళ్లకుండా చర్యలు చేపడతారు.మండ మెలిగేపండుగతో జాతర ప్రారంభమైనట్టు అని సమ్మక్క సారలమ్మ పూజారులు చెబుతున్నారు