సందీప్ కిషన్ గత కొన్నేళ్లుగా హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అసలు సందీష్ కిషన్ ఖాతాలో హిట్టు పడి చాలా ఏళ్లు అవుతోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రేంజ్‌లో మళ్లీ సక్సెస్ చూడలేకపోయాడు సందీప్ కిషన్. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా, ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోన్నాడు. చివరగా మైఖేల్ అంటూ భారీ ప్రయత్నమే చేశాడు. కానీ అది కూడా బెడిసి కొట్టేసింది. ఇక ఇప్పుడు ఊరుపేరు భైరవకోన అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. కానీ ఓ రెండ్రోజుల ముందే ప్రీమియర్లు పడుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని ఫిబ్రవరి 14న కొన్ని ఏరియాల్లో ప్రదర్శించబోతోన్నారు. ఆల్రెడీ టికెట్లు కూడా సేల్ అయిపోయాయి. బుకింగ్స్ జోరందుకోవడంతో వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. చూస్తుంటే భైరవకోన సినిమా మీద ఎంతటి బజ్ హైప్ ఏర్పడిందో అర్థం అవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. తన ఆర్థిక కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. కరోనా టైంలో అందరం ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని, ఆ టైంలో తనకి కూడా సమస్యలు వచ్చాయని అన్నాడు. ఆ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు, కనీసం తన స్టాఫ్‌కు అయినా జీతాలు చెల్లించేందుకు డబ్బులు కావాలి కదా? అని వద్దకు ఏ సినిమా వస్తే ఆ సినిమా ఒప్పేసుకున్నాడట. అలా చేసిన చిత్రమే కెప్టెన్ మిల్లర్ అని అన్నాడు.