పేదల బియ్యం పక్కదారి.. 100 క్వింటాళ్లు మాయం!
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యంపై అక్రమార్కుల కన్ను పడింది..! అర్హులైన నిరుపేదలకు చేరాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూర్దిపాడులో ఏకంగా 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు కాగా.. మరో డీలర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసలు బియ్యం ఎక్కడికి వెళ్లింది? ఈ అక్రమాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూర్దిపాడు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది.
అధికారుల వివరాల ప్రకారం.. గ్రామ రేషన్ దుకాణానికి స్టాక్ పాయింట్ నుంచి మొత్తం 203 బస్తాల బియ్యం సరఫరా కాగా.. వాటిలో 160 బస్తాలను మాత్రమే డీలర్ అరుణ్ కుమార్ తన దుకాణంలో దింపుకున్నట్లు గుర్తించారు.
అంతేకాదు.. దుకాణంలో దింపుకున్న బియ్యం సైతం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 40 బస్తాలను ఎలాంటి అనుమతులు లేకుండా బూచినెల్లి రేషన్ దుకాణానికి తరలించినట్లు విచారణలో వెల్లడైంది.
ఇక బూర్దిపాడు దుకాణంలో గతంలో ఉన్న పాత స్టాక్‌కు సంబంధించి కూడా సుమారు 50 క్వింటాళ్ల లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మొత్తంగా 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారించిన పౌరసరఫరాల శాఖ అధికారులు.. డీలర్ అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.
మరోవైపు అనుమతులు లేకుండా 40 క్వింటాళ్ల బియ్యాన్ని తన దుకాణంలో దింపుకున్న బూచినెల్లి డీలర్ సంతోష్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే!
పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యం పేదలకు చేరకుండా మధ్యలోనే మాయమైతే.. బాధ్యత ఎవరిది?
స్టాక్ పాయింట్ నుంచి రేషన్ దుకాణం వరకు బియ్యం సరఫరా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగింది?
ఈ 100 క్వింటాళ్ల బియ్యం ఎక్కడికి వెళ్లింది? అక్రమంగా తరలించిన బియ్యం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా?
అధికారులు కేసు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా.. పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులదే!
.........థంబ్‌నెయిల్ ...
* పేదల బియ్యం మాయం!
* 100 క్వింటాళ్లు ఎక్కడికి?
* రేషన్ డీలర్ల అక్రమ బాగోతం!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment