తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 9 నుంచి 12వ తరగతి (Classes 9 to 12) వరకు ఒకే విద్యా బోర్డు (Common Education Board) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పదో తరగతి వరకు పాఠశాల విద్యా బోర్డు, ఇంటర్మీడియట్‌కు ప్రత్యేక బోర్డు ఉండగా.. ఈ రెండు వ్యవస్థలను విలీనం చేసి ఒకే విధానంలో విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల విద్యార్థులకు చదువులో నిరంతర కొనసాగింపు కల్పించడంతో పాటు పరిపాలనా వ్యవస్థను సరళీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రతిపాదనలో భాగంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE), పదో తరగతి బోర్డు వ్యవస్థలను కలిపి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (Telangana School Education Board) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1962కు సవరణలు చేయడంతో పాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1971ను రద్దు చేసే ప్రతిపాదన ఉంది. ఈ అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 Education System అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 11, 12 తరగతులను కూడా School Education Department పరిధిలోకి తీసుకురానున్నారు. విద్యార్థుల Dropout Rates తగ్గించడం, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం పెంచడం, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే కొత్త బోర్డు పూర్తి విధివిధానాలు, పరీక్షల నిర్వహణ, అమలు తేదీలపై ప్రభుత్వం నుంచి మరిన్ని అధికారిక వివరాలు రావాల్సి ఉంది.