ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) మరో భారీ ప్రాజెక్టును దక్కించుకుంది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (NMRC) నుంచి రూ.1,000 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. నోయిడా మెట్రో ఆక్వా లైన్ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 15.1 కిలోమీటర్ల ఎలివేటెడ్ మెట్రో వయాడక్ట్ నిర్మించనుంది. బొటానికల్ గార్డెన్ నుంచి నోయిడా సెక్టార్-142 వరకు, అలాగే డిపో స్టేషన్ నుంచి బొరాకి వరకు రెండు మార్గాల్లో నిర్మాణ పనులు చేపట్టనుంది. వీటితో పాటు 10 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల నిర్మాణం, ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు కూడా L&T పరిధిలో ఉంటాయి.

ఈ భారీ మెట్రో ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నోయిడా ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందించడమే ఈ విస్తరణ ప్రధాన ఉద్దేశం. ఈ ఆర్డర్‌తో దేశంలోని మౌలిక సదుపాయాల రంగంలో L&T తన ప్రాజెక్టుల జాబితాను మరింత విస్తరించుకుంది.