ఇబ్రహీంపట్నంలో సినిమా స్టెప్స్‌ను తలపించే ఘరానా మోసం.. కొడుకుగా నటించి ఆస్తి కొల్లగొట్టే యత్నం!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సినిమా ఫక్కీని తలపించే షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 24 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కుమారుడే తిరిగి వచ్చాడని భావించిన ఓ వృద్ధ తండ్రి ఆనందం ఆవిరైపోయింది. ఆస్తిని కొల్లగొట్టే లక్ష్యంతో కొందరి కేటుగాళ్ళు పన్నిన పక్కా వ్యూహం వల్ల ఈ దారుణ మోసం బయటపడింది.
ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటకు చెందిన పిశాటి లక్ష్మారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి 24 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. జాడ తెలియని కొడుకు కోసం ఆ వృద్ధ తండ్రి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. దీన్ని అదునుగా భావించిన మోహన్‌రెడ్డి అనే వ్యక్తి, నకిలీ వ్యక్తి (యాదయ్య)ను రంగంలోకి దించి.. అతనే మీ తప్పిపోయిన కొడుకు శ్రీనివాస్ అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. సాధువు వేషధారణలో ఉన్న ఆ నకిలీ వ్యక్తిని చూపిస్తూ, అసలు కొడుకు ఇతనేనని నమ్మించి వృద్ధుడి నుంచి రూ. 40 లక్షలు డిమాండ్ చేయడంతో పాటు కొంత నగదు కూడా వసూలు చేశారు.
అయితే కొడుకు వయసు, ఆ వ్యక్తి పోలికలపై తండ్రికి, కుటుంబ సభ్యులకు తీవ్ర అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ (DNA Test) నిర్వహిస్తామని గట్టిగా నిలదీయడంతో ఆ నకిలీల బండారం బట్టబయలైంది. తాము ఆశ పడిన కొడుకు కేవలం ఆస్తి కోసం వేసిన డ్రామా అని తెలుసుకుని ఆ వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment