భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బిహార్ సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 కోసం బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టుకు వైభవ్‌ను సారథిగా నియమించింది.

ఇప్పటికే తన దూకుడైన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఈ కెప్టెన్సీ మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. గతంలో దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్, ఇషాన్ కిషన్ గాయపడిన సమయంలో తాత్కాలిక కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.

ఇప్పుడు బిహార్ సీనియర్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం అతని క్రికెట్ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు. 15 ఏళ్ల వయసులోనే ఇలాంటి నాయకత్వ బాధ్యతలు దక్కించుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా వైభవ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.