భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ (Lakshya Sen) మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జపాన్‌లో జరిగిన Kumamoto Masters Japan Super 500 టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ఆటగాడు కోకి వతనాబే (Koki Watanabe)పై 13-21, 21-18, 21-14 స్కోరుతో విజయం సాధించాడు. తొలి గేమ్ ఓడిపోయినా అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్స్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచాడు.

ఈ ఫైనల్‌లో లక్ష్యసేన్ ప్రదర్శించిన ఒక ప్రత్యేకమైన షాట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ (David Beckham) ఫ్రీ కిక్‌లను తలపించేలా Shuttlecockను వంపు తిప్పుతూ ప్రత్యర్థి కోర్టులోకి పంపిన Swerve Return బ్యాడ్మింటన్ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిర్ణయాత్మక గేమ్‌లో లక్ష్యసేన్ తన వేగం, చురుకుదనం, అద్భుతమైన Court Coverageతో వతనాబేకు అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు.


ఈ విజయంతో లక్ష్యసేన్ వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. గత వారం జర్మనీలో జరిగిన Hylo Open టైటిల్ గెలిచిన అతను, ఇప్పుడు జపాన్‌లోనూ విజేతగా నిలిచి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా Kumamoto Masters పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో BWF World Tour Finals అర్హత రేసులోనూ తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకున్నాడు.