ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇస్కాన్ (ISKCON) వ్యవస్థాపకుడు ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద (A.C. Bhaktivedanta Swami Srila Prabhupada) జీవిత కథ ఆధారంగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ (Saranagati – The Life of a Surrendered Soul) పేరుతో కొత్త సినిమాను తెరకెక్కిస్తోంది. ట్రాన్స్‌సెండెంటల్ ఫిలిమ్స్ (Transcendental Films) భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

ఈ సినిమాలో శ్రీల ప్రభుపాద ఆధ్యాత్మిక ప్రయాణం, ఆయన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన విధానాన్ని చూపించనున్నారు. ముఖ్యంగా 1965లో 69 ఏళ్ల వయసులో భారత్ నుంచి అమెరికాకు ఆయన చేపట్టిన చారిత్రాత్మక ప్రయాణం కథలో కీలకంగా ఉండనుంది. ఈ సినిమాకు గౌర శక్తి దాస దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే Artificial Intelligence Motion Capture Technology ఉపయోగించి రూపొందించనున్నారు. నిజమైన వ్యక్తుల కదలికలు, హావభావాలను డిజిటల్ యానిమేషన్ పాత్రలుగా మార్చే సాంకేతికతతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2027 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘KGF’, ‘కాంతార’, ‘మహావతార్ నరసింహ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలిమ్స్ నుంచి వస్తున్న ఈ ఆధ్యాత్మిక చిత్రం (Spiritual Biopic) పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.