డ్రైనేజీ పనుల్లో బయటపడ్డ రూ.94 కోట్ల బంగారు నిధి.. మొదట నాణెం అనుకున్న కార్మికుడు!
మట్టిని తవ్వుతుండగా కనిపించిన ఓ చిన్న నాణెం... చివరకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన బంగారు నిధికి దారి తీసింది.
సుమారు 9 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.94 కోట్ల విలువైన బంగారం బయటపడింది. ఇందులో 49 బంగారు బార్లు, బంగారు నాణేలు, మరికొన్ని బంగారు ముక్కలు ఉన్నట్లు సమాచారం.
ఈ సంచలన ఘటన బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండ్రెమొండే ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ పాత బ్రూవరీ యజమాని నివసించిన భవనాన్ని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.
భవనంలో డ్రైనేజీ వ్యవస్థ కోసం తవ్వకాలు చేపట్టిన సమయంలో 18 ఏళ్ల విద్యార్థి కోబేతో పాటు నిర్మాణ కార్మికులు మట్టిని తొలగిస్తున్నారు.
అప్పుడే ఓ చిన్న వస్తువు వారి కంటపడింది.
మొదట అది సాధారణ ఒక యూరో నాణెం అయి ఉంటుందని కార్మికుడు భావించాడు. కానీ మరింత లోతుగా తవ్వడంతో అసలు విషయం బయటపడింది.
అక్కడ ఒక గోడలో దాచిన భారీ బంగారు నిల్వ కనిపించింది.
49 బంగారు బార్లు... బంగారు నాణేలు... మరికొన్ని బంగారు ముక్కలు!
వాటి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.94 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఇంత భారీ బంగారం కనిపించినా కార్మికులు దానిని తమ దగ్గర ఉంచుకోలేదు.
వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అధికారులు మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకుని అత్యంత భద్రత ఉన్న ప్రభుత్వ భద్రతా కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దాచారు? ఎందుకు దాచారు? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.
News · · 7 views